ఐసీసీ ప్రకటించే అవార్డుల గురించి తాను పెద్దగా ఆలోచించడం లేదని భారత ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. జాతీయ జట్టులో ఆడే విషయాన్ని గురించి తప్ప తాను మరే విషయం గురించీ పెద్దగా ఆలోచించబోనని గంభీర్ వ్యాఖ్యానించాడు.
ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డులకు తన పేరు ఎంపికకాకపోవడంపై గంభీర్ మాట్లాడుతూ అవార్డులు సాధించాలన్న ఆలోచన తనలో ఎప్పుడూ లేదని అన్నాడు. అలాగే రికార్డులు సృష్టించాలన్న ఆలోచన కూడా తనలో లేదని గంభీర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం తన ప్రదర్శన పట్ల తాను సంతృప్తితో ఉన్నానని గంభీర్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
తనలోని బలహీనతలను మెరుగుపర్చుకుంటూ తాను గరిష్టంగా పరుగులు చేయగల్గుతున్నానని అందుకే ఆట గురించి తప్ప మిగిలిన విషయాల గురించి తాను పెద్దగా పట్టించుకోవడం లేదని గంభీర్ తెలిపాడు.
ఈ ఏడాదిలో భారత్ తరపున కెప్టెన్ ధోనీ తర్వాత వన్డే క్రికెట్‌లో గంభీర్ మాత్రమే అత్యధిక పరుగులు సాధించడం గమనార్హం. మొత్తం 23 వన్డేల్లో 47.20 సగటుతో ఈ ఏడాది గంభీర్ మొత్తం 944 పరుగులు సాధించాడు. అదేసమయంలో ధోనీ 24 మ్యాచ్‌లలో 955 పరుగలు సాధించి గంభీర్ కంటే ముందు స్థానంలో నిలిచాడు.
|