ఆస్ట్రేలియాపై అజేయ సెంచరీ సాధించిన వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ సీనియర్ ఆటగాళ్ల పనైపోయిందంటూ వ్యాఖ్యానిస్తున్న విమర్శకులపై ధ్వజమెత్తారు. సీనియర్ క్రికెటర్ల రిటైర్‌మెంట్ గురించి అవాకులు చెవాకులు రాస్తున్న సందేహరాయుళ్లు ఇకనైనా తన రాతలను, వ్యాఖ్యలను నిలిపివేయాలని చెప్పారు.టీమ్‌లో భాగం కాకుండా టీమ్ వెలుపల ఉంటున్న కొంతమంది సందేహరాయుళ్లు సీరీస్‌కు ముందు నుంచి సీనియర్ క్రికెటర్ల గురించి కథలు కథలుగా దుష్ప్రచారం చేస్తూ వచ్చారని లక్ష్మణ్ విచారం వ్యక్తం చేశారు. అయితే ఈ విమర్శలను తాము సానుకూలంగా తీసుకున్నామని, ఆసీస్‌తో పోరులో టీమ్ మొత్తంగా ఒక్కటై నిలిచిందని చెప్పారు. టీమ్‌లోంచి వెళ్లిపోమని చెప్పడం అంటే ఏ క్రీడాకారుడినైనా బాధించి తీరుతుందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. తమను అతిగా గౌరవించమని ప్రజలను తాము కోరడం లేదని, కాని తమకు కనీస గౌరవాన్ని ఇవ్వాలని, తామెప్పుడు రిటైర్ కావాలో నిర్ణయించుకునే హక్కును తమకు ఇవ్వాలని చెప్పారు. జట్టుకు సేవలందించటం ఎప్పుడు ఆపివేయాలనే విషయంపై నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత ఆటగాళ్లదేనని లక్ష్మణ్ చెప్పారు. దేశానికి సుదీర్ఘ కాలం సేవలందించిన వారు తామెప్పుడు ఆట నిలిపివేయాలో అవగాహన లేకుండా ఉండరని పేర్కొన్నారు. ఐపిఎల్ దక్కన్ చార్జర్స్ కెప్టెన్సీ నుంచి తొలగించబడిన ఈ 33 ఏళ్ల హైదరాబాదీ బ్యాట్స్‌మన్ తాను బ్యాటింగ్ మీదే దృష్టి పెడుతున్నానని, జట్టుకు తోడ్పడటమే తన విధి అని చెప్పారు. గత మ్యాచ్‌లలో తాను నిరాశ చెందానని, జట్టుకు తోడ్పడాలని భావించానని తెలిపిన లక్ష్మణ్ డబుల్ సెంచరీ సాధించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. జట్టు ప్రయోజనాల రీత్యా ఈ సమయంలో తాను ఎక్కువ పరుగులు చేయడం అన్నదే ముఖ్యమైన విషయమని చెప్పారు. లక్ష్మణ్, గంభీర్ డబుల్ సెంచరీలతో కదం తొక్కడంతో ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో రెండో రోజు ఆటలో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 613 పరుగుల భారీస్కోరు చేసి డిక్లేర్ చేసింది.150 పరుగులు చేసిన అనంతరం కూడా తాను రిస్క్ తీసుకోకుండా కీలక ఇన్నింగ్స్ ఆడటం మీదే దృష్టి పెట్టానని ఆసీస్‌పై సెంచరీ చేయడమే గొప్ప అయితే అంతటితో వదిలి వేయకుండా దానిని డబుల్ సెంచరీగా మార్చడంలో తాను విజయం పొందానని లక్ష్మణ్ చెప్పారు. ఈ రోజు ఆటలో తాను ఎక్కువగా రిస్క్ తీసుకోలేదని, అలాగని తాను దురాశా పరుడిని కాదని కూడా తెలిపారు.ఆరోగ్యకరమైన పరుగుల రేటుపై తాను కేంద్రీకరించానని, భారత బ్యాట్స్‌మెన్‌పై కంగారూలు వైవిధ్యపూరితంగా బంతులేశారని, అన్ని రకాల ప్రయత్నాలు చేశారని, అయితే పుల్ మార్కులు మాత్రం భారత్‌కే చెందాలని లక్ష్మణ్ చెప్పారు. ఒకే ఇన్నింగ్స్‌లో పలు భారత బ్యాట్స్‌మెన్ మంచి ఆటతీరు ప్రదర్శించడం అసాధారణం కాదని అభిప్రాయపడ్డారు. బ్యాటింగ్ విభాగంగా తాము చాలా సందర్భాల్లో బాగానే ఆడామని, ఈ రోజు కూడా తాము జట్టుగా మంచి ప్రదర్శనే ఇచ్చామని చెప్పారు. ఆసీస్ తన ముందున్న విపత్కర పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందన్నదే ఆసక్తికరమైన విషయమని లక్ష్మణ్ అన్నారు. ఇప్పుడు ఒత్తిడి మొత్తంగా ఆసీస్ పైనే ఉందని రేపటి తొలి సెషన్ వారికి చాలా కీలకమైందని చెప్పారు. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |