వివాదాస్పద అంపైర్ నిర్ణయాలను అంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టమ్‌కు అప్పగించే విషయంపై అంతర్జాతీయ క్రికెట్ కమిటీ చర్చిస్తోంది. దీనిపై రెండు రోజుల పాటు చర్చించిన ఐసీసీ కమిటీ, రెఫరల్ సిస్టమ్‌కు అనుమతి ఇచ్చేందుకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
రెండు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ క్రికెట్ కమిటీ సమావేశం మంగళవారంతో ముగిసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో దోషపూరితంగా ఇచ్చిన ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని అంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టమ్‌కు ఆటగాడు ఫిర్యాదు చేసే అంశంపై తీవ్రంగా చర్చించారు.
అయితే, ఈ విధానాన్ని జులైలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే యాషెస్ టెస్ట్ సిరీస్ నుంచి అమలు చేయడం సాధ్యపడదని ఐసీసీ తేల్చి చెప్పింది. ఒకవేళ ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. 2009 అక్టోబరు నుంచి ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది.
జూన్ 22 నుంచి 26 తేదీల్లో ఐసీసీ వార్షిక సదస్సు జరుగనుంది. ఈ సమయంలోనే ఐసీసీ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీలు సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఇది అమలుకు వస్తే తప్పుడు నిర్ణయాలకు బలయ్యే ఆటగాళ్ళకు మంచి ఊరట కలుగుతుంది. |