బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ అనిల్ కుంబ్లే.. తమ జట్టు బ్యాట్స్‌మెన్, బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై బెంగుళూరు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం ఆత్మవిశ్వాసంతో రాణించిన బ్యాట్స్‌మెన్, బౌలర్లదేనని కుంబ్లే వ్యాఖ్యానించాడు.వాండరర్స్‌లో మ్యాచ్ ముగిసిన అనంతరం విలేకరులతో కుంబ్లే మాట్లాడుతూ, ప్రవీణ్, వినయ్‌లు చివరి వరకు చక్కగా బౌలింగ్ చేశారన్నాడు. చెన్నై తమ ముందుంచిన లక్ష్యం చిన్నదేమీ కాదని.. అయినప్పటికీ తమ బ్యాట్స్‌మెన్‌లు బౌండరీలతో నిర్ణీత ఓవర్ల కన్నా ముందుగానే జట్టును విజయతీరాలకు చేర్చారన్నాడు.గత ఏడాది తొలి ఐపీఎల్ సీజన్ ఫైనల్ రన్నరప్‌గా నిలిచిన చెన్నై రెండో సీజన్‌లో మాత్రం సెమీస్ నుండే వైదొలగింది. మనీష్ పాండే, సీనియర్ ఆటగాడు, గ్రేట్ వాల్ రాహుల్ ద్రావిడ్ అనుభవం బెంగుళూరు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాయి.అదలా ఉంచితే.. తాము ముందుగా 160 పరుగులు చేయాలనుకున్నామని.. అయితే వికెట్లు ఉన్నప్పటికీ.. స్లాగ్ ఓవర్లలో పరుగులు సాధించలేకపోయామని చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. కానీ, బెంగుళూరు జట్టు ఉత్తమ ప్రదర్శనను కనబరచిందన్నాడు. కాగా, ఫైనల్లో బెంగుళూరు జట్టు.. హైదరాబాద్ డెక్కన్ ఛార్జర్స్‌తో తలపడనుంది. ఈ రోజు సాయంత్రం ఈ మ్యాచ్ జరుగనుంది. |