ప్రారంభ ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ- 20 క్రికెట్ టోర్నమెంట్ (సీఎల్‌టీ-20) ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో జరుగుతుంది. ఈ టోర్నీలో పన్నెండు జట్లు తలపడతాయి. టోర్నమెంట్‌ను అక్టోబరు 8 నుంచి 23 వరకు నిర్వహిస్తామని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కమిషనర్ లలిత్ మోడీ వెల్లడించారు.
ఐపీఎల్ ఫైనల్స్‌కు చేరిన రెండు జట్లు, లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల నుంచి రెండేసి అగ్రశ్రేణి ట్వంటీ- 20 జట్లు, న్యుజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక దేశవాళీ ట్వంటీ- 20 ఛాంపియన్లు ఛాంపియన్స్ లీగ్‌లో ఆడతాయి.
టోర్నీలో మొత్తం 23 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీలో ఆరు మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ అందిస్తారు. 12 జట్లను నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్క గ్రూపులో మూడు జట్లు ఉంటాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు మిగిలిన గ్రూపు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.
ప్రతి గ్రూపులోనూ తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు రెండో దశకు చేరుకుంటాయి. రెండో దశ నుంచి నాలుగు జట్లు సెమీస్‌కు చేరతాయి. ఈ వివరాలను ఆదివారం లలిత్ మోడీ వెల్లడించారు. గత ఏడాది జరగాల్సిన ప్రారంభ ఛాంపియన్స్ లీగ్‌ను ముంబయి దాడుల కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. |