ట్వంటీ- 20 క్రికెట్‌లో కచ్చితంగా యువ ఆటగాళ్లదే రాజ్యమైనప్పటికీ, వారు రాణించేందుకు అనుభవజ్ఞుల (సీనియర్లు) మద్దతు, మార్గనిర్దేశం తప్పనిసరి అని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ రెండో సీజన్‌లో కుంబ్లే నేతృత్వంలోని బెంగళూరు జట్టు రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
మాథ్యూ హేడెన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే వంటి రిటైర్ ఆటగాళ్లు ఐపీఎల్ రెండో సీజన్‌లో యువకుల కంటే మెరుగ్గా రాణించారు. టోర్నీలో హేడెన్ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఆరంజ్ క్యాప్ దక్కించుకోగా, గిల్‌క్రిస్ట్ ప్లేయిర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. కుంబ్లే ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు (21) దక్కించుకున్న బౌలర్‌గా నిలిచాడు.
ఈ నేపథ్యంలో కుంబ్లే మాట్లాడుతూ.. జట్టులో సీనియర్లు ఉండటం.. యువ ఆటగాళ్లు మెరుగ్గా ఆడేందుకు ఉపయోగపడుతుందన్నాడు. ఇది వాస్తవానికి యువ ఆటగాళ్ల క్రీడే. దీనికి ఫిట్‌నెస్‌తోపాటు, చురుగ్గా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఆరుగురు లేదా ఏడుగురు యువ ఆటగాళ్లు ఉన్నప్పుడు, ఒత్తిడిని అధిగమించేందుకు సీనియర్లు, అనుభవజ్ఞుల ఉపయోగపడతారు. వారుంటే ప్రతికూల పరిస్థితులను కాస్త సులభంగా అధిగమించవచ్చని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. |