ప్రపంచకప్ సహ ఆతిథ్య దేశ హోదాలో పాకిస్థాన్‌కు 10 మిలియన్ డాలర్లకుపైగా ఫీజు చెల్లించేందుకు అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసీసీ) అంగీకరించింది. భద్రతాపరమైన కారణాలతో పాకిస్థాన్‌లో జరగాల్సివున్న 14 వన్డే మ్యాచ్‌లను ఐసీసీ ఇటీవల ఉపసంహరించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పాకిస్థాన్‌కు ప్రపంచకప్ ఫీజుల్లో వాటాను కొనసాగించేందుకు ఐసీసీ సుముఖత వ్యక్తం చేసింది.
ఐసీసీ ఏప్రిల్‌లో తీసుకున్న మ్యాచ్‌ల ఉపసంహరణ నిర్ణయంతో 2011 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ కోల్పోయింది. శ్రీలంక క్రికెట్ జట్టుపై లాహోర్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ప్రపంచకప్ ఆతిథ్య దేశాలకు ఒక్కో మ్యాచ్ నిర్వహణకు ఐసీసీ 750000 డాలర్లు చెల్లించనుంది.
సోమవారం లండన్‌లో జరిగిన ప్రపంచకప్ ఆతిథ్య దేశాల సమావేశంలో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు పాకిస్థాన్ పరిస్థితిని అర్థం చేసుకున్నాయి. పాకిస్థాన్ నుంచి తొలగించిన మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన పక్షంలో వాటికి ఎటువంటి ఫీజులు తీసుకోబోమని సహ ఆతిథ్య దేశాలు స్పష్టం చేసినట్లు ఐసీసీ అధ్యక్షుడు డేవిడ్ మోర్గాన్ ఓ ప్రకటనలో తెలిపారు. |