ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో టీం ఇండియా సూపర్ ఎయిట్ దశ నుంచే ఇంటిముఖం పట్టడానికి ఫిట్‌నెస్‌లేని ఆటగాళ్లను ఎంపిక చేయడం కూడా ఓ కారణమని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. ప్రపంచకప్‌లో జట్టు పేలవ ప్రదర్శనకు సెలెక్షన్ విధానం కూడా కారణమన్నాడు.
గాయాలతో బాధపడుతున్న ఆటగాళ్లను ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేశారు. సూపర్ ఎయిట్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లోనూ టీం ఇండియా పరాజయం పాలైంది. వెస్టిండీస్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలతో జరిగిన మూడు సూపర్ ఎయిట్ మ్యాచ్‌లలోనూ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ టీం ఇండియా 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడింది.
సూపర్ ఎయిట్ దశలో ఒక్క విజయం కూడా సాధించలేకపోవడంపై ధోనీ దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడుతూ.. ఇక్కడి పరిస్థితులు తమ పరాజయానికి కారణమయ్యాయని తాను భావించడం లేదన్నాడు. కొంత మంది ఆటగాళ్లు ఫామ్‌లో లేరు. నేను కూడా. తమ పరాజయానికి ఇదే ప్రధాన కారణమని ధోనీ తెలిపాడు.
ఆరుగురు బ్యాట్స్‌మెన్, ఏడో స్థానంలో ఆల్‌రౌండర్‌తో ఆడుతున్నాము. వీరిలో ముగ్గురు సరిగా ఆడకపోతే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. ఈ టోర్నమెంట్ మొత్తం తమ బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. అయితే ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాటింగ్ సమస్యగా మారింది. బ్యాటింగ్‌పరంగా మేము ఆశించిస్థాయిని అందుకోలేకపోయాము.
పూర్తి సామర్థ్యంమేర ఆడలేకపోయాము. దురదృష్టవశాత్తూ టోర్నీ మొత్తం ఈ సమస్య టీం ఇండియాను వెంటాడిందని ధోనీ పేర్కొన్నాడు. తొమ్మిది నెలల తరువాత జరిగే తరువాతి ప్రపంచకప్‌కు తమ జట్టు ఈ సమస్యలను అధిగమించి బలమైన జట్టుగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. |