చేతివేలి గాయంతో బాధపుడుతున్న సచిన్ టెండూల్కర్ త్వరలో ప్రారంభం కానున్న టీం ఇండియా వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26 నుంచి వెస్టిండీస్‌లో ప్రారంభం కానున్న నాలుగు వన్డేల సిరీస్ టీం ఇండియా మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ అందుబాటులో ఉండటం అనుమానాస్పదమైంది. భారత జట్టు వెస్టిండీస్ పర్యటన కోసం ఈ నెల 22న ఇంగ్లాండ్ నుంచి నేరుగా పయనమవనుంది.
చేతివేలు గాయం నుంచి సచిన్ టెండూల్కర్ కోలుకొని వంద శాతం ఫిట్‌నెస్ సాధిస్తే ఈ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న పక్షంలోనే సచిన్‌ను కరేబియన్ దీవులకు పంపే అవకాశం ఉంది. గత ఏప్రిల్‌లో న్యూజిలాండ్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లో సచిన్ చేతి వేలుకు గాయం అయింది.
అనంతరం ఈ గాయం నుంచి కోలుకున్నప్పటికీ.. ఏప్రిల్- మే నెలల్లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్ సందర్భంగా సచిన్ గాయం తిరగబెట్టింది. ప్రస్తుతం సచిన్ కుటుంబసభ్యులతో లండన్‌లోనే ఉన్నాడు. సెలెక్షన్ కమిటీ సభ్యులు శ్రీకాంత్, రాజా వెంకట్‌లతో పాటు, బీసీసీఐ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసన్‌లు కూడా అక్కడే ఉన్నారు.
వెస్టిండీస్ టూర్ జట్టు ఎంపికపై బుధవారం వీరు చర్చలు జరపనున్నారు. అనంతరం జట్టును ప్రకటించే అవకాశం కూడా ఉంది. గాయాలతో బాధపడుతున్న జహీర్‌ఖాన్, సెహ్వాగ్‌లు కూడా వెస్టిండీస్ టూర్‌కు అందుబాటులో ఉండటం లేదు. నాలుగు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే జమైకాలో ఈ నెల 26 జరగనుంది. రెండో వన్డే 28 (జమైకా)లో జులై 3, 5 తేదీల్లో మూడు, నాలుగు వన్డేలు సెయింట్ లూసియాలో జరుగుతాయి. |