తమ జట్టు కోచ్, మేనేజర్ జాన్ బుకానన్‌కు ఉద్వాసన పలికినట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) గురువారం అధికారికంగా ప్రకటించింది. నైట్‌రైడర్స్ తన కోచ్‌ను తప్పించినట్లు ముందురోజే మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయాన్ని కేకేఆర్ యాజమాన్యం ధృవీకరించింది.
వివాదాస్పద ఆస్ట్రేలియా కోచ్ జాన్ బుకానన్‌తో స్నేహపూర్వకంగానే సంబంధాలు తెంచుకున్నామని, ఈ నిర్ణయం ఇరువర్గాల సమ్మతంతోనే జరిగిందని కేకేఆర్ యాజమానుల్లో ఒకరైన జాయ్ మెహతా ఓ ప్రకటనలో తెలిపింది. తక్షణ ప్రాతిపదికన కేకేఆర్ కోచ్ బాధ్యతల నుంచి బుకానన్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
జాన్ బుకానన్ నేతృత్వంలో గత రెండు ఐపీఎల్ సీజన్‌లలోనూ కేకేఆర్ జట్టు ఆశించిన ఫలితాలు సాధించని సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన రెండో సీజన్‌లో అయితే జట్టు ఘోరంగా విఫలమై అట్టడుగు స్థానంలో నిలిచింది. బహుళ కెప్టెన్ విధానం వంటి విన్నూత్న అంశాలు తెరపైకి తీసుకురావడం ద్వారా బుకానన్ వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. |