ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌కు టీం ఇండియా మేనేజర్‌గా వ్యవహరించిన వి.చాముండేశ్వరనాథ్ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను తోసిపుచ్చారు. ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ఇటీవల చాముండేశ్వరనాథ్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపిస్తూ.. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆయనను తొలగించిన సంగతి తెలిసిందే.
దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఈ ఆరోపణలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. తాను దేశంలో లేనప్పుడు ఇటువంటి ఆరోపణలతో చర్యలు తీసుకోవడం, వారి అసలు ఉద్దేశాన్ని బయటపెడుతుందన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేయడం ఇది మరేదీ కాదన్నారు.
విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం కుర్చీల కొనుగోలులో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా చాముండేశ్వరనాథ్ స్పందించారు. ఇందులో అవినీతి ఏమీ జరగలేదని, అన్నీ పద్దతి ప్రకారం జరిగాయని బదులిచ్చారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కుర్చీలే హైదరాబాద్, జైపూర్, రాంఛీ స్టేడియాల్లోనూ ఉన్నాయని, అన్ని కాగితాలపై, నిబంధనల ప్రకారం జరిగాయని చాముండీ స్పష్టం చేశారు.
మహిళా క్రీడాకారిణిలను వేధించినట్లు వచ్చిన ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి ఆరోపణలను మహిళా క్రీడాకారిణిలెవరైనా చేశారా అని ఎదురు ప్రశ్నించారు. ఏ క్రీడాకారిణి ఇటువంటి ఆరోపణలు చేయలేదని, వారికి ప్రత్యేక సెలెక్షన్ కమిటీ ఉందని పేర్కొన్నారు. |