పాకిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదికి ఆ దేశ ట్వంటీ- 20 క్రికెట్ కెప్టెన్సీ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఆడిన చివరి రెండు మ్యాచ్‌లలో ఆల్‌రౌండ్ ప్రతిభ చాటిన అఫ్రిది, ఆ జట్టు ట్వంటీ- 20 ప్రపంచకప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. సెమీస్, ఫైనల్స్ రెండు మ్యాచ్‌లలోనూ అఫ్రిది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
శ్రీలంకతో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. ఈ విజయంతో తొలిసారి ట్వంటీ- 20 ప్రపంచకప్‌ను పాకిస్థాన్ చేజిక్కించుకుంది. మ్యాచ్ విజయం అనంతరం అఫ్రిది మాట్లాడుతూ.. రిటైర్ అయ్యేలోగా జాతీయ జట్టుకు కనీసం ఒక్కసారైనా కెప్టెన్సీ వహించే అవకాశం వస్తే సంతోషిస్తానని చెప్పాడు.
అయితే ఆ అవకాశం అతిత్వరలోనే ఈ ఆల్‌రౌండర్‌కు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ కెప్టెన్ యూనిస్ ఖాన్ ట్వంటీ- 20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అతని స్థానంలో జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అఫ్రిదికే దక్కే అవకాశాలు ఉన్నాయి. ఓ సీనియర్ ఆటగాడిగా జట్టులో తన బాధ్యతలను అఫ్రిది చక్కగా పోషించాడు. యూనిస్ స్థానంలో అతనే ట్వంటీ- 20 కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. |