ఐసీసీ ప్రపంచ ట్వంటీ- 20 జట్టులో భారతీయ ఆటగాళ్లెవరూ చోటు దక్కించుకోలేకపోయారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన ప్రపంచ ట్వంటీ- 20 జట్టులో టీం ఇండియా సభ్యులెవరూ లేకపోగా, పాకిస్థాన్ నుంచి అత్యధికంగా నలుగురు ఆటగాళ్లు ఇందులో చోటు దక్కించుకున్నారు.
తాజా ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో ప్రదర్శన ఆధారంగా నిపుణులు ఈ జట్టును ఎంపిక చేశారు. గణాంకాలను కూడా పరిగణలోకి తీసుకున్నప్పటికీ, జట్టు ఎంపికకు వీటిని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోలేదు. 12 మంది సభ్యుల ఐసీసీ ప్రపంచ ట్వంటీ- 20 జట్టులో పాకిస్థాన్ నుంచి నలుగురు, దక్షిణాఫ్రికా, శ్రీలంకల నుంచి చెరో ముగ్గురు, వెస్టిండీస్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.
పాకిస్థాన్ కెప్టెన్ యూనిస్ ఖాన్‌ను ఈ జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించారు. వెస్టిండీస్ జట్టు నుంచి క్రిస్ గేల్, డ్వానే బ్రావో, శ్రీలంక నుంచి దిల్షాన్, అజంతా మెండిస్, మలింగా (12వ ఆటగాడు), దక్షిణాఫ్రికా నుంచి జాక్వస్ కలీస్, డివిలియర్స్, పార్నెల్, పాకిస్థాన్ జట్టు నుంచి యూనిస్ ఖాన్, షాహిద్ అఫ్రిది, కమ్రాన్ అక్మల్, ఉమర్ గుల్‌లు ప్రపంచ జట్టులోకి ఎంపికయ్యారు. |