వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎంపిక చేసిన ట్రైనింగ్ స్క్వాడ్‌లో మాజీ కెప్టెన్ మైకెల్ వాన్‌కు మొండిచెయ్యి చూపారు. ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ సాంప్రదాయ యుద్ధానికి సన్నద్ధమయ్యేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 16 మంది ఆటగాళ్లు బృందాన్ని ఎంపిక చేసింది.
2005లో యాషెస్ సిరీస్ సాధించిన ఇంగ్లాండ్ జట్టుకు సారథ్యం వహించిన మైకెల్ వాన్‌కు ఈ ఆటగాళ్ల బృందంలో చోటుదక్కలేదు. గత ఏడాది ఆగస్టులో టెస్ట్ కెప్టెన్సీని వదులుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు మైకెల్ వాన్ ఇంగ్లాండ్ తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇటీవల కుడిమోకాలికి మళ్లీ గాయం కావడంతో మైకెల్ వాన్ ఇబ్బంది పడ్డాడు.
ఇదిలా ఉంటే ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిసన్ కూడా ట్రైనింగ్ స్క్వాడ్‌కు ఎంపిక కాలేదు. మోకాలి శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్, ఇటీవల వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌కు దూరమైన రైన్ సైడ్‌బాటమ్ తిరిగి ఇంగ్లాండ్ బృందంలో చోటుదక్కించుకున్నారు. ఐదు మ్యాచ్‌ల యాషెస్ టెస్ట్ సిరీస్ జులై 8న ప్రారంభం కానుంది. |