ఇంగ్లాండ్ జట్టులోని భారత సంతతి ఆటగాడు రవి బొపారా త్వరలో ప్రారంభం కాబోతున్న ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ సాంప్రదాయ యాషెస్ సిరీస్‌లోనూ ఆడబోతున్నాడు. వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న ఈ సాంప్రదాయ యుద్ధంలో ఆడే అవకాశం రావడంపై బొపారా మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ జట్టులో నా స్థానాన్ని నిలబెట్టుకున్నానని చెప్పాడు.
ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్‌కు కీలమైన మూడో స్థానంలో బొపారా బ్యాటింగ్ చేయబోతున్నాడు. గత రెండు నెలల్లో జట్టులో తన చోటును పదిలం చేసుకున్నానని బొపారా సోమవారం చెప్పాడు. దేశం కోసం ఆడే సమయంలో టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాలని తానెప్పుడూ కోరుకుంటానని తెలిపాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా వంటి బలమైన ప్రత్యర్థిపై టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం ఓ గొప్ప సవాలన్నాడు.
బొపారా టెస్ట్ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. 2007 శ్రీలంక పర్యటనలో వరుసగా మూడు డకౌట్‌లతో టెస్ట్ కెరీర్‌ను బొపారా ఇబ్బందుల్లోకి నెట్టుకున్నాడు.
అయితే ఇటీవల వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించి విమర్శకుల నోళ్లు మూయించాడు. అంతేకాకుండా వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఐదో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు బొపారా రికార్డు సృష్టించాడు. తనను ఈ స్థితిలో చూసుకోవడానికి ఎంతో శ్రమించానని బొపారా చెప్పాడు. యాషెస్ సిరీస్ వచ్చే నెల 8న ప్రారంభం కానుంది. |