ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) షెడ్యూల్ కారణంగానే ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో టీం ఇండియా విఫలం అయిందని మాజీ క్రికెటర్ మహీందర్ అమర్‌నాథ్ అభిప్రాయపడ్డారు. చిరాకుపెట్టే ఐపీఎల్ షెడ్యూల్ ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో జట్టు ఘోర ప్రదర్శనకు కారణమైందని ఆరోపించారు.
ఇదిలా ఉంటే త్వరలో భారత్- వెస్టిండీస్ జట్లు మధ్య వన్డే సిరీస్ ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీం ఇండియా అక్కడ కేవలం నాలుగు వన్డేలు మత్రమే ఆడనున్న సంగతి తెలిసిందే. ఇంత అతిస్పల్ప పర్యటన ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో భారత జట్టు వైఫల్యానికి సంబంధించి కోచ్ గ్యారీ కిర్‌స్టన్ వెల్లడించిన అభిప్రాయాలతో తాను కూడా ఏకీభవిస్తానన్నారు. ట్వంటీ- 20 క్రికెట్‌లో భారత ఆటగాళ్ల ప్రతిభను కొలిచేందుకు మాత్రం నిరాకరించారు. కెప్టెన్ ధోనీతో సహా ఐదుగురు కీలక ఆటగాళ్లు గాయలతో ట్వంటీ- 20 ప్రపంచకప్‌కు వెళ్లిన టీం ఇండియా అక్కడ సూపర్ ఎయిట్ దశ నుంచి ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే.
వీరికి ప్రపంచకప్‌కు ముందు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గాయాలయ్యాయి. ఐపీఎల్ జరిగిన సమయాన్ని కూడా అమర్‌నాథ్ ప్రశ్నించారు. ప్రపంచకప్‌కు వెళ్లిన జట్టులో సగం మంది ఆటగాళ్లు పూర్తి ఫిట్‌నెస్‌తో లేరు.
ఇటువంటి పరిస్థితుల్లో వారి నుంచి విజయాలు ఎలా ఆశించగలమన్నారు. ఇది ఐపీఎల్ కాదు. ఇది అంతర్జాతీయ క్రికెట్ అని అన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకొనే ఉంటే ఆటగాళ్లు గాయాలను తప్పించుకొని ఉండేవారని అమర్‌నాథ్ అభిప్రాయపడ్డారు. |