ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో చేరిన న్యూజిలాండ్ ఫాస్ బౌలర్ షేన్ బాండ్ తిరిగి ఆ దేశ జాతీయ జట్టులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఐసీఎల్‌తో సంబంధాలు తెంచుకున్న షేన్ బాండ్‌కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు క్రికెట్ కాంట్రాక్టు అప్పగించింది. మొత్తం 20 మంది ఆటగాళ్లు న్యూజిలాండ్ క్రికెట్ కాంట్రాక్టులు అందుకున్నారు. వీరిలో బాండ్ కూడా ఉన్నాడు.
కాంట్రాక్టు లభించడంతో షేన్ బాండ్ త్వరలోనే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లోకి పునరాగమనం చేయనున్నాడు. ఇదిలా ఉంటే మాజీ టెస్ట్ క్రికెటర్లు స్కాట్ స్టైరిస్, జామీ హో, పీటర్ ఫుల్టెన్‌లు కాంట్రాక్టులు కోల్పోయారు. మిగిలిన దేశాల బోర్డులతో పోలిస్తే, ఐసీఎల్‌లో చేరిన ఆటగాళ్లను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బాగా ఆదరిస్తోంది.
మిగిలిన దేశాల బోర్డులు ఐసీఎల్ ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ ద్వారాలు తెరిచేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుండగా, న్యూజిలాండ్ బోర్డు మాత్రం ఈ విషయంలో కాస్త తొందరగా నిర్ణయాలు తీసుకుంటుంది.
తాజా నిర్ణయంతో షేన్ బాండ్ ఆగస్టులో న్యూజిలాండ్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడేందుకు మార్గం సుగమమైంది. శ్రీలంకకు వెళ్లే న్యూజిలాండ్ జట్టులో బాండ్ చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఆపై వన్డేలు, ట్వంటీ- 20 క్రికెట్‌లోకి కూడా బాండ్ పునరాగమనం చేసే అవకాశాలు ఉన్నాయి. |