తాను అన్న మాట నిలబెట్టుకుంది వెస్టిండీస్. ఆది నుండి భారత్‌ను కోలుకోకుండా చేసి 8 వికెట్ల తేడాతో విండీస్ ఘనవిజయం సాధించింది. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమం అయింది. భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, అండగా నిలిచిన ఆర్పీసింగ్‌లు మినహాయిస్తే.. మిగిలిన భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా అలా కుప్పకూలిపోయింది.
అంతకుముందు టాస్ గెలిచిన భారత్.. భారీ లక్ష్యాన్ని నిర్ధేశించే ఉద్ధేశ్యంతో తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అలసత్వాన్ని వీడండి.. అలాగని అత్యుత్సాహం వద్దు. అని ధోనీ ఉపదేశించిన మాటలు సహచరుల బుర్రల్లో సరిగ్గా ఎక్కినట్లు లేదు. విండీస్ జట్టు బౌలర్లు తమ బాధ్యతను ఆరంభం నుండే చక్కగా పోషించడం వల్లో లేక.. భారత బ్యాట్స్‌మెన్‌లు అలసత్వం ప్రదర్శించడం వల్లో ఏదైతేనేం.. భారత్‌కు రెండో వన్డేలో ఓటమి మాత్రం తప్పలేదు.
బ్యాటింగ్‌కు దిగిన తొలి ఓవర్లోనే దినేష్ కార్తీక్ (4), ఆ తర్వాత ఓవర్లో గంభీర్ డకౌట్, రోహిత్ డకౌట్‌లుగా వరుస పట్టారు. ఆ తర్వాత వచ్చిన యువరాజ్ కూడా అవుట్ అయ్యే ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. టేలర్ వేసిన బంతి యువీ బ్యాట్ అంచున చివరలో తాకి రెండో స్లిప్ వరకు వెళ్లలేదు. బంతి స్లిప్‌లో ఫీల్డర్‌కు అందకపోవడంతో యువీ భారత్ ఊపిరపీల్చుకుంది.
ఆ తర్వాత యూవరాజ్‌తో జత కట్టిన ధోనీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. మంచి షాట్లతో యూవీ ఆకట్టుకుంటుండగా.. ధోనీ నిలకడగా రాణించాడు. షాట్లు కొట్టే క్రమంలో ఓ అనవసరపు షాట్‌తో యూవరాజ్ (35) వెనుదిరిగాడు.
ఆ తర్వాత కథ మళ్లీ మొదటికొచ్చింది. అందరి ఆశలని తుంచేస్తూ.. యూసుఫ్ పఠాన్ డకౌట్, జడేజా (7), హర్భజన్ (7), ప్రవీణ్ (1)ల ఇలా వచ్చి ఆఘమేఘాల మీద అలా వెళ్లిపోయారు. దీంతో 82 పరుగులకే 8 వికెట్లు నేలకూలాయి. కానీ కెప్టెన్ ధోనీ తన బాధ్యతను మరువలేదు.
తొమ్మిదో వికెట్‌గా వచ్చిన ఆర్పీసింగ్‌తో కలిసి ధోనీ ముందుకు కదిలాడు. వీరిద్దరూ కలిసి 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఇది నాలుగో అత్యుత్తమ భాగస్వామ్యంగా రికార్డ్ నమోదైంది. ఏదైతేనేం చివరికి భారత్ 48.2 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్ అయింది.
విండీస్ బౌలర్లలో టేలర్ 3 వికెట్లు, రాంపాల్ 4 వికెట్లు, బ్రావో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేధించేందుకు బరిలోకి దిగిన విండీస్ బ్యాట్స్‌మెన్‌లు చక్కగా రాణించారు. 34.1 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి విండీస్ లక్ష్యాన్ని అందుకుంది. రోహిత్ శర్మ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ వికెట్ కీపర్ రామ్‌దిన్ ఐదు క్యాచ్‌లు పట్టడం విశేషం. |