ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న పాకిస్థాన్ జట్టును ఎంపిక చేసిన ఆ దేశ జాతీయ క్రికెట్ సెలెక్టర్లు ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారు. పాక్ ప్రపంచకప్ విజయంతో దేశంలో పెద్దఎత్తున వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో తమను మాత్రం పూర్తిగా విస్మరించారని పాకిస్థాన్ సెలెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ జట్టును ఎంపిక చేసిన తమను విజయోత్సవాల్లో భాగస్వాములను చేయకుండా విస్మరించడం సరికాదని వారు పేర్కొన్నారు. పాకిస్థాన్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అబ్దుల్ ఖాదీర్ ఇంగ్లాండ్‌లో ప్రపంచకప్ జరుగుతున్న సమయంలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
అనంతరం కమిటీలో మిగిలిన ఇద్దరు సెలెక్టర్లు సలీం జాఫర్, షోయబ్ మొహమ్మద్‌ల విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీలంక టెస్ట్ పర్యటనకు వెళ్లిన జట్టును ఎంపిక చేసేందుకు పీసీబీ మధ్యంతర సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది.
దీనికి మాజీ కెప్టెన్ వాసిం బారీని ఛైర్మన్‌గా నియమించింది. ప్రపంచకప్ విజయంపై జరుగుతున్న వేడుకలకు తమనెవరూ ఆహ్వానించలేదు. ఈ జట్టును ఎంపిక చేసి ఇంగ్లాండ్ పంపింది తామైనప్పటికీ, తమకు ఎటువంటి ఆహ్వానం లేకపోవడం, తమ సేవలను ఏమాత్రం గుర్తించకపోవడం బాధాకరమని ఓ సెలెక్టర్ పేర్కొన్నారు. |