కింగ్‌స్టన్‌లోని సబైనా మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ చెత్త షాట్ల ఎంపికే తన పనిని సులభం చేసిందని వెస్టిండీస్ బౌలర్ రవి రామ్‌పాల్ అభిప్రాయపడ్డాడు. రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్‌ను రామ్‌పాల్ ఇబ్బంది పెట్టాడు. కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను ఈ మ్యాచ్‌లో నమోదు చేసుకున్నాడు.
కీలకమైన సమయాల్లో భారత్ వెన్నువిరిచిన రామ్‌పాల్ ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీనిపై రామ్‌పాల్ మాట్లాడుతూ.. భారత బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యపు షాట్ల కోసం ఎదురు చూశానని తెలిపాడు. బంతితో కొంత స్వింగ్ లభిస్తోంది. దీంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ చెత్త షాట్ల ఎంపికతో తప్పులు చేసే వరకు ఎదురు చూశాను. అనుకున్నట్లుగానే ఫలితం లభించిందని మ్యాచ్ అనంతరం రామ్‌పాల్ వ్యాఖ్యానించాడు.
వెస్టిండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి వన్డేలో భారీ స్కోరు చేసిన భారత బ్యాట్స్‌మెన్ రెండో వన్డేలో మాత్రం 188 పరుగులకే పరిమితమయ్యారు. స్వల్ప లక్ష్యాన్ని వెస్టిండీస్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయంతో నాలుగు వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది. రామ్‌పాల్ 37 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతని కెరీర్‌లో ఇవే అత్యుత్తమ గణాంకాలు.
తన ప్రదర్శనపై రామ్‌పాల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఈ రోజు తనకు అన్నీ కలిసొచ్చాయని, తన బౌలింగ్ కూడా అత్యుత్తమ స్థాయిలో ఉందని తెలిపాడు. భారత బ్యాట్స్‌మెన్ షార్ట్‌పిచ్ బంతులు ఎదుర్కోవడానికి ఇబ్బంది పడతారని తెలుసు. అందుకే షార్ట్‌పిచ్ బంతులను సద్వినియోగపరుచుకున్నా. మధ్యమధ్యలో ఈ బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌ను ఆశ్చర్యపరిచానని రామ్‌పాల్ తెలిపాడు. రామ్‌పాల్ వేసిన తొలి ఓవర్‌లోనే గౌతం గంభీర్, రోహిత్ శర్మ డకౌట్‌లుగా పెవీలియన్ దారిపట్టారు. |