ప్రస్తుత యాషెస్ సిరీస్ సందర్భంగా స్లెడ్జింగ్ (మాటల యుద్ధం)కు దూరంగా ఉండాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ క్రికెటర్లకు జారీ చేసిన ఆదేశాలు పాంటింగ్ సేనపై ఏమాత్రం ప్రభావం చూపబోవని ఇంగ్లాండ్ కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్ అభిప్రాయపడ్డాడు. యాషెస్ సిరీస్‌లో వారు మాటల యుద్ధాన్ని వదులుకుంటారని తాను భావించడం లేదన్నాడు.
ఈసారి కూడా వారు స్లెడ్జింగ్ చాకచక్యాన్ని ప్రదర్శిస్తారని పేర్కొన్నాడు. జులై 8న ప్రారంభం కాబోతున్న యాషెస్ సిరీస్‌లో అనవసర వివాదాలకు దూరంగా ఉండేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఇటీవల పాంటింగ్ సేనలోని ఆటగాళ్లందరికీ మైదానంలో మాటల యుద్ధానికి దూరంగా ఉండాలని సూచించింది. అయితే కాలింగ్‌వుడ్ మాత్రం సీఏ ఆదేశాలు పనిచేస్తాయని తాను భావించడం లేదని అన్నాడు.
ఆస్ట్రేలియా క్రికెట్ సంస్కృతిలోనే స్లెడ్జింగ్ అంతర్భాగమని, వారిని దీనికి దూరంగా ఉంచేందుకు సీఏ ముక్తసరి ఆదేశాలు పనిచేయవని కాలింగ్‌వుడ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్‌లో దిట్టలు. యువకుడిగా వాళ్లతో చాలా క్రికెట్ ఆడాను. చిన్నవయస్సు నుంచే వాళ్ల క్రికెట్ సంస్కృతిలో ఇది భాగమైవుంది. ఇంగ్లాండ్ కూడా ఇటువంటి మాటల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నాడు. |