ఆస్ట్రేలియా మాజీ కోచ్ జాన్ బుకానన్ ఇంగ్లాండ్ జట్టుతో చేతులు కలిపాడు. బుకానన్ వైరివర్గంలో చేరడం పట్ల యాషెస్ సిరీస్‌పై ప్రభావం చూపుతుందేమోనని ఆస్ట్రేలియా జట్టు సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లాండ్ జట్టుకు జాన్ బుకానన్ ఇప్పుడు తాత్కాలిక సలహాదారుడయ్యాడు.
ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్‌లు త్వరలో సాంప్రదాయ యాషెస్ సిరీస్‌లో తలపడబోతున్నాయి. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జులై 8న ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో తమ రహస్యాలన్నీ తెలిసిన జాన్ బుకానన్ ప్రత్యర్థి జట్టుకు తాత్కాలిక సలహాదారుడిగా మారడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
దశాబ్దకాలం పాటు ఆసీస్ సాధించిన విజయాల్లో తనదైన ముద్ర వేసిన ఆసీస్ మాజీ కోచ్ జాన్ బుకానన్ ఇంగ్లాండ్ శిబిరంలో చేరడం ఇబ్బందికరమేనని పాంటింగ్ పెదవి విరిచాడు. బుకానన్ ప్రత్యర్థి శిబిరంలో చేరడం ఆశ్చర్యపరిచింది. బుకానన్ వారితో చేతులు కలుపుతాడని ఊహించలేదు. ఇది తనను తీవ్ర నిరాశపరిచిందని పాంటింగ్ తెలిపాడు.
బుకానన్ కోచ్‌గా ఉన్న సమయంలో ఇంగ్లాండ్ జట్టును ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌లో వైట్‌వాష్ చేసింది. 2007 యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 5-0తో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే బుకానన్ ఇంగ్లాండ్‌తో జతకట్టడం వలన ఆసీస్ ఆటగాళ్లపై ఏమాత్రం ప్రభావం చూపదని పాంటింగ్ అన్నాడు. ఆయన వారం, రెండు వారాలు మాత్రమే ఆ జట్టుతో ఉండే అవకాశముందన్నాడు. |