ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మరోసారి క్రమశిక్షణారాహిత్యం వ్యవహరించినట్లు తెలుస్తోంది. గతంలో ఓసారి విమానం మిస్సయిన ఫ్లింటాఫ్, ఈసారి జట్టు బస్సు మిస్సయ్యాడు. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు ఆండ్ర్యూ ఫ్లింటాఫ్‌ను ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మందలించింది.
మరికొన్ని రోజుల్లో యాషెస్ సిరీస్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. రాద్ధాంతం సృష్టించడం ఎందుకనుకుందో.. ఈసీబీ ఫ్లింటాఫ్‌పై ఎటువంటి చర్యలకు పూనుకోలేదు. బస్సు అందుకోకుండా క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు చివాట్లతోనే సరిపెట్టింది.
ప్రతిష్టాత్మక యాషెష్‌కు ముందు జట్టుపై ప్రభావం చూపే చర్యలు చేపట్టకూడదని ఈసీబీ నిర్ణయించుకోవడంతో మందలింపులతో ఫ్లింటాఫ్ తప్పించుకున్నాడు. అసలు విషయమేంటంటే యాషెస్ సన్నాహాల్లో భాగంగా బెల్జియంలో ఇంగ్లాండ్ జట్టుకు ఈసీబీ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసింది.
ఇందులో భాగంగా శనివారం మొదటి ప్రపంచ యుద్ధంలో అసువులు బాసిన వీరులకు వైప్రెస్‌లో నివాళులర్పించేందుకు ఇంగ్లాండ్ జట్టు అక్కడికి వెళ్లింది. ఇది పూర్తయ్యాక ఇంగ్లాండ్ ఆటగాళ్ల బృందం బయల్దేరిన బస్సు వద్దకు ఫ్లింటాఫ్ నిర్ణీత సమయంలో చేరుకోలేకపోయాడు.
యాషెష్‌కు ముందు అనవసర ఇబ్బందులు సృష్టించుకోవడం ఎందుకని ఫ్లింటాఫ్‌ను దీనిపై ఈసీబీ మందలించింది.
గతంలోనూ ఫ్లింటాఫ్ జట్టు నిబంధనలకు పలుమార్లు తూట్లు పొడిచాడు. ఒకసారైతే వెస్టిండీస్‌లో పర్యటించేందుకు ఆటగాళ్లతో బయలుదేరుతున్న విమానాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించి ఫ్లింటాఫ్ మిస్సయ్యాడు. 2007 ప్రపంచకప్ సందర్భంగా ఫ్లింటాఫ్ మద్యం సేవించి చిందులేయడం వివాదాస్పదమైంది. |