వెస్టిండీస్ కెప్టెన్ క్రిస్ గేల్ పశ్చిమ ఆస్ట్రేలియా తరపున ట్వంటీ- 20 క్రికెట్ ఆడబోతున్నాడు. ఈ వేసవిలో జరిగే దేశవాళీ ట్వంటీ-20 ఛాంపియన్‌షిప్‌లో పశ్చిమ ఆస్ట్రేలియా జట్టు క్రిస్ గేల్ సేవలను పొందటంలో విజయవంతమైంది. ట్వంటీ- 20 క్రికెట్‌కు అవసరమైన పెద్ద హిట్టర్లలో ఒకడిగా ఉన్న క్రిస్ గేల్ 12 టీ- 20 మ్యాచ్‌లు ఆడి 41.27 సగటుతో 454 పరుగులు చేశాడు.
క్రిస్ గేల్ వంటి అద్భుతమైన ఆటగాడిని సొంతం చేసుకోవడం పట్ల వారియర్స్ కోచ్ టామ్ మూడీ సంతోషం వ్యక్తం చేశారు. కేఎఫ్‌సీ బిగ్ బాష్ ఛాంపియన్‌షిప్‌లో క్రిస్ గేల్ పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులను అలరిస్తాడని వ్యక్తం చేశారు. పశ్చిమ ఆస్ట్రేలియా జట్టు ఆ ఏడాది భారత్‌లో జరిగే ట్వంటీ- 20 ఛాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించలేని సంగతి తెలిసిందే.
వచ్చే ఏడాది ఛాంపియన్స్ లీగ్‌కు తాము అర్హత సాధిస్తామని టామ్ మూడీ ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మరో వెస్టిండీస్ ఆటగాడు డ్వానే బ్రావో విక్టోరియా జట్టు తరపున ఆడనున్నాడు. ఇదిలా ఉంటే పశ్చిమ ఆస్ట్రేలియా జట్టు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను కూడా తమ జట్టులో తిరిగి ఆడాలని సంప్రదించింది. అయితే గిల్లీ పశ్చిమ ఆస్ట్రేలియా జట్టు ఆఫర్‌ను తోసిపుచ్చాడు. |