సుమారు నాలుగు నెలల క్రితం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టుపై లాహోర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి మిగిల్చిన విషాదఛాయలు శనివారం తొలగిపోనున్నాయి. టెస్ట్ సిరీస్ ఆడుతున్న శ్రీలంక జట్టును లక్ష్యంగా చేసుకొని ఈ ఏడాది మార్చి 3న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
వారి కాల్పుల్లో ఏడుగురు శ్రీలంక క్రికెటర్లు గాయపడగా, వారికి రక్షణగా ఉన్న ఎనిమిది మంది స్థానిక పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాద దాడి కారణంగా ఆనాటి టెస్ట్ సిరీర్ రద్దయింది. ఇరుదేశాల మధ్య టెస్ట్ క్రికెట్ మళ్లీ శనివారం పునరుద్ధరించబడుతోంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇరుదేశాల మధ్య తొలి టెస్ట్ గాలేలో జరగనుంది.
ఇదిలా ఉంటే రెండు వారాల క్రితం ట్వంటీ- 20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో శ్రీలంక జట్టును ఓడించి పాకిస్థాన్ టైటిల్‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఆతిథ్య జట్టు తహతహలాడుతోంది. అంతేకాకుండా శ్రీలంకలో పాకిస్థాన్ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ సిరీస్‌ను చేజార్చుకోలేదు.
ఆ జట్టుకు ఇక్కడ ఘనమైన రికార్డు కలిగివుండటం ఆతిథ్య జట్టు అసంతృప్తితో ఉంది. పాకిస్థాన్ శ్రీలంక పర్యటనల్లో మూడు టెస్ట్ సిరీస్‌లు చేజిక్కించుకుంది. గత రెండు పర్యటనల్లోనూ (2000, 2006) టెస్ట్ సిరీస్‌లను పర్యాటక పాకిస్థాన్ జట్టు ఎగరేసుకెళ్లింది.
ఇదిలా ఉంటే శ్రీలంకలో భద్రతా పరిస్థితులపై పాకిస్థాన్ కోచ్ ఇంతిఖాబ్ ఆలం నమ్మకం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎటువంటి భయం లేదని చెప్పారు. ట్వంటీ- 20 నుంచి బయటపడి సాంప్రదాయ ఐదు రోజుల క్రికెట్ పరిస్థితులకు జట్టు త్వరగా అలవాటు పడాలి. దీనిపై తాము ఆందోళన చెందుతున్నామని ఆలం పేర్కొన్నారు. |