దక్షిణాఫ్రికాలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్ ప్రారంభానికి ముందు వెనక్కిపంపబడిన మొహమ్మెద్ కైఫ్‌ను రాజస్థాన్ రాయల్స్ తిరిగి జట్టులోకి తీసుకుంది. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లీష్ ఛాంపియన్ మిడిల్‌సెక్స్‌తో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడించేందుకు కైఫ్‌కు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆహ్వానం పలికింది.
ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ జులై 6న జరుగుతుంది. దీనికోసం జైపూర్‌లో జరుగుతున్న ప్రాక్టీస్ క్యాంపుకు హాజరుకావాలని కైఫ్‌కు పిలుపు అందింది. దీనిపై కైఫ్ మాట్లాడుతూ.. జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల గురించి తనకు తెలియదని, అయితే ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడేందుకు అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో ఆడాలని, దీనికి అందుబాటులో ఉండాలని రాజస్థాన్ రాయల్స్ జట్టు కోరింది. దక్షిణాఫ్రికా నుంచి జట్టు యజమాన్యం తనను ఎందుకు వెనక్కు పంపిందో తెలియదని, అదే విధంగా ఇప్పుడు తనను మళ్లీ ఎందుకు పిలిచారో కూడా తెలియదని కైఫ్ తెలిపాడు. ఈ విషయాలు అధికారులనే అడగాలని కైఫ్ సూచించాడు. |