అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు గౌతం గంభీర్, హర్భజన్‌సింగ్ టాప్-10లో చోటు దక్కించుకున్నారు. బ్యాటింగ్‌లో గంభీర్, బౌలింగ్‌లో హర్భజన్ మాత్రమే టాప్-10 ర్యాంకుల్లో స్థానం సంపాదించుకున్నారు. మిగిలిన వారిలో టీం ఇండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (13), వీవీఎస్ లక్ష్మణ్ (15), వీరేంద్ర సెహ్వాగ్ (20)వ స్థానాలను సొంతం చేసుకున్నారు. టెస్టుల్లో నిలకడగా రాణించిన గంభీర్ 847 పాయింట్లతో మూడో ర్యాంక్‌ను పొందాడు. మరోవైపు బౌలింగ్‌లో హర్భజన్ సింగ్ ఆరో ర్యాంక్‌లో నిలవగా, ఏస్ బౌలర్ జహీర్‌ఖాన్ 11వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. అదేవిధంగా.. యువ బౌలర్ ఇషాంత్‌శర్మ 20వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక, జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్ (117) పాయింట్లతో మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా (128) పాయింట్లతో ప్రథమ స్థానంలోనూ, దక్షిణాఫ్రికా (119) పాయింట్లతో రెండో స్థానంలోనూ నిలిచాయి. |