శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ గాయం కారణంగా పర్యాటక పాకిస్థాన్ జట్టుతో గాలేలో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. శ్రీలంక- పాకిస్థాన్ మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ గాలేలో శనివారం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి టెస్ట్ మ్యాచ్‌కు మోకాలి గాయం కారణంగా మురళీధరన్ అందుబాటులో ఉండటం లేదని అధికారిక వర్గాలు తెలిపింది.
స్పిన్ దిగ్గజం మురళీధరన్ అందుబాటులో లేకపోవడంతో శ్రీలంక జట్టు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించింది. మోకాలి గాయం కారణంగా మురళీధరన్‌కు విశ్రాంతి అత్యవసరమైందని అధికారులు తెలిపారు. మురళీధరన్ ఖాతాలో 770 టెస్ట్ వికెట్లు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు అతనిపేరుపై ఉన్న సంగతి తెలిసిందే.
లాహోర్‌లో తీవ్రవాద దాడి అనంతరం శ్రీలంక, పాకిస్థాన్ జట్లు తిరిగి టెస్ట్ ఆడటం ఇదే మొదటి సారి. తొలి టెస్ట్ శనివారం గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఇరుజట్లు ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన ట్వంటీ- 20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి పాకిస్థాన్ జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. |