ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలలో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడేందుకు ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనుమతి ఇచ్చింది. తొలి ఐపీఎల్ టోర్నీలో అదరగొట్టిన తన్వీర్.. దక్షిణాఫ్రికాలో జరిగిన రెండో ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు.
పీసీబీ అనుమతి నిరాకరించడంతో ఈటోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. ముంబైపై పాక్‌కు చెందిన తీవ్రవాదులు దాడులు జరపడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ ఆటగాళ్లు దూరమయ్యారు. అయితే ఇటీవల ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ గాడిన పడే సూచనలు కనిపిస్తున్నాయి.
దీంతో రాజస్థాన్ ఫ్రాంచైజీ జట్టు తరపున ఆడేందుకు తన్వీర్‌కు పీసీబీ అనుమతి ఇచ్చింది. తొలి ఐపీఎల్ టోర్నీలో విజేతగా నిలిచిన రాజస్థాన్ జట్టు ఈనెల ఆరో తేదీన ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో ఛారిటీస్ మ్యాచ్ జరుగనుంది. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో సోహైల్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడేందుకు పీసీబీ అనుమతి ఇచ్చింది. |