క్రీడా స్ఫూర్తి గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని ఇంగ్లండ్ మాజీ కోచ్ డంకన్ ఫ్లెచెర్ విమర్శించారు. ఇంగ్లాండ్ కార్డిఫ్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో క్రీడా స్ఫూర్తిని అగౌరవపరిచిందని, ఇందుకు విరుద్ధంగా ఆడిందని ఆస్ట్రేలియా కెప్టెన్ పాంటింగ్ విమర్శించిన సంగతి తెలిసిందే.
ఇంగ్లండ్ కార్డిఫ్ టెస్ట్ చివరి రోజున డ్రా కోసం సమయాన్ని వృధా చేసేందుకు జిమ్మిక్కులను ఆశ్రయించిందని పాంటింగ్ దుయ్యబట్టాడు. దీనిపై ఫ్లెచెర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియన్లకు క్రీడా స్పూర్తి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఆస్ట్రేలియానే ఎక్కువసార్లు క్రీడా స్ఫూర్తిని మంటగలిపిందని విమర్శించారు. 2005లో ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ కైవసం చేసుకోవడంలో అప్పటి కోచ్ ఫ్లెచెర్ కీలకపాత్ర పోషించారు.
కార్డిఫ్ టెస్ట్‌లో చివరి వికెట్ భాగస్వామ్యాన్ని విడగొట్టలేకపోవడంతో పాంటింగ్‌కు చికాకు వచ్చింది. అసహనంతోనే పాంటింగ్ క్రీడా స్ఫూర్తికి ఇంగ్లాండ్ విరుద్ధంగా ఆడిందని విమర్శించాడని ఫ్లెచెర్ పేర్కొన్నారు. కార్డిఫ్ టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.
ప్రపంచంలో పాంటింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టే ఎక్కువసార్లు క్రీడాస్పూర్తిని మంటగలిపిందన్నారు. ఇంగ్లండ్ చివరి వికెట్ పడగొట్టడంలో ఆస్ట్రేలియా బౌలర్లు విఫలమయ్యారు. ఫలితంగా టెస్ట్ డ్రా అయింది. ఈ చికాకుతోనే పాంటింగ్ క్రీడా స్ఫూర్తిని తెరపైకి తెచ్చాడని ఫ్లెచెర్ అభిప్రాయపడ్డారు. |