చారిత్రక లార్డ్స్ మైదానంలో గత 75 ఏళ్లుగా ఓటమెరుగని ఆస్ట్రేలియా సేనకు ఇంగ్లండ్ జట్టు సోమవారం దాని రుచి చూపించింది. లార్డ్స్‌లో ఘనమైన రికార్డు ఉన్న ఆస్ట్రేలియాను మట్టికరిపించడంతోపాటు, ఇక్కడ జరిగిన యాషెస్ రెండో టెస్ట్‌లో ఆతిథ్య జట్టు 115 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యత సాధించింది. క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్‌లో ఇంగ్లండ్ జట్టుకు 1934 తరువాత ఇదే తొలి యాషెస్ విజయం.
చివరిసారి లార్డ్స్‌లో టెస్ట్ క్రికెట్ ఆడుతున్న ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్ ఈ మైదానంలో తన సత్తాను ఘనంగా చాటుకున్నాడు. ఐదో రోజున ఆట సాగిన 105 నిమిషాలపాటు ఇరు జట్లు టెస్ట్ క్రికెట్ మజాను గుర్తు చేశాయి. విజయానికి ఐదు వికెట్లు దూరంలో చివరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌కు తొలి ఓవర్‌లోనే ఫ్లింటాఫ్ తీపికబురు అందించాడు. ప్రమాదకర హాడిన్ (80)ను ఒక్క పరుగు కూడా చేయనివ్వకుండా పెవీలియన్‌కు పంపి ప్రత్యర్థికి కష్టాలు గుర్తు చేశాడు.
అనంతరం ఇంగ్లండ్ స్పిన్నర్ స్వాన్ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచిన క్లార్క్‌ను (136) బౌల్డ్ చేశాడు. క్లార్క్, హాడిన్‌లను పెవీలియన్ చేరినా, ఆసీస్ లోయరార్డర్ బ్యాట్స్‌మన్ జాన్సన్ (63) ఒంటిరిపోరాటం చేశాడు. అతనికి మిగిలిన బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం కొరవడింది. జాన్సన్ పదో వికెట్‌గా స్వాన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌కు తెరపడింది. చివరి రోజు ఫ్లింటాఫ్ మూడు వికెట్లు పడగొట్టగా, స్వాన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
రెండో ఇన్నింగ్స్‌లో ఫ్రెడ్డీ మొత్తం ఐదు వికెట్లు నేలకూల్చాడు. స్వాన్ నాలుగు, స్టువర్ట్ బ్రాడ్ ఓ వికెట్ దక్కించుకున్నారు. చివరి రోజున 313/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 406 పరుగుల వద్ద ఆలౌటయింది. ఫ్లింటాఫ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 521 పరుగుల రికార్డు ఛేదన కోసం బరిలో దిగిన ఆస్ట్రేలియాను రెండో ఇన్నింగ్స్‌లో అంపైర్ నిర్ణయాలు కూడా కొంతమేర వేధించాయి. ముగ్గురు బ్యాట్స్‌మెన్ అనుమానాస్పద నిర్ణయాలకు బలైయ్యారు.
వీటిని పక్కనబెడితే నాలుగో రోజు ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 128 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతg కష్టాల్లో కూరుకుపోయింది. అనంతరం హాడిన్, క్లార్క్‌లు ఆరో వికెట్‌కు 185 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి ఆస్ట్రేలియా విజయవకాశాలను చిగురింపజేశారు. వీరిద్దరు సమర్థవంతంగా ఆడటంతో కోలుకున్న ఆస్ట్రేలియా చివరిరోజు విజయానికి 209 పరుగుల దూరంలో నిలిచింది. అయితే ఐదో రోజున ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా విజయావకాశాలు మృగ్యమయ్యాయి. |