ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రస్తుత యాషెస్ సిరీస్‌కు ఏదైనా బాగా తీవ్రమైన గాయమైతేనే తాను దూరం అవతానని ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ చెప్పాడు. ప్రస్తుత యాషెస్‌లో ఆడకుండా తననేదీ అడ్డుకోలేదని ఉన్నాడు. ఒకవేళ ఏదైనా గాయమైనా, అది బాగా తీవ్రమైంది అయివుంటేనే తాను ఈ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉందన్నాడు.
చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో 75 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఇక్కడ జరిగిన యాషెస్ రెండో టెస్ట్‌లో ఫ్లింటాఫ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఫ్లింటాఫ్ ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో 31 ఏళ్ల ఫ్లింటాఫ్ మాట్లాడుతూ.. మిగిలిన మూడు యాషెస్ టెస్ట్ మ్యాచ్‌లలోనూ ఆడేందుకు ప్రయత్నిస్తానన్నాడు.
ఈ యాషెస్ సిరీస్ అనంతరం ఫ్లింటాఫ్ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. మోకాలి గాయం ఇబ్బందిపెడుతున్నప్పటికీ రెండో టెస్ట్‌లో ఫ్లింటాఫ్ ఆడాడు. అయితే ఎడ్జ్‌బాస్టన్‌లో జులై 30న ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌కు ఫ్లింటాఫ్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గాయం బాగా తీవ్రమైనదయితేనే తాను ప్రస్తుత యాషెస్‌లో ఏ మ్యాచ్‌కైనా దూరమయ్యే అవకాశం ఉందన్నాడు. |