వచ్చే 2011 ప్రపంచ కప్ పోటీల నిర్వహణలో భాగంగా ఒక్క మ్యాచ్‌ను కూడా పాకిస్థాన్‌లో నిర్వహించడం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తేల్చి చెప్పింది. ఈ మేరకు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు ఇజాజ్ భట్, ఐసీసీ అధ్యక్షుడు డేవిడ్ మోర్గాన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది.
అదేసమయంలో మ్యాచ్‌లను రద్దు చేయడం వల్ల కలిగే నష్టాన్ని కొంతమేరకు పూడ్చేందుకు పీసీబీకి ఐసీసీ మరింత పరిహారం అందించనుంది. ఇప్పటికే, ఆతిథ్య ఫీజులను ఐసీసీ చెల్లించనున్న విషయం తెల్సిందే. ఇదిలావుండగా, తమ దేశంలో నిర్వహించే ప్రపంచ కప్ పోటీలను ఇతర దేశాలకు తరలించడంపై న్యాయ పోరాటం చేయాలని భావించిన పీసీబీ వెనకడుగు వేసింది.
న్యాయ పోరాటనికి దిగితే ఆతిథ్య ఫీజును కూడా ఇవ్వబోమని ఐసీసీ హెచ్చరించడంతో పీసీబీ దిగిరాక తప్పలేదు. కాగా, 2011 ప్రపంచ కప్ పోటీలను భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.
అయితే, లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై తీవ్రవాదులు దాడులు జరపడంతో ఆ దేశంలో పర్యటించేందుకు పలు క్రికెట్ జట్లు ససేమిరా అంటున్నాయి. ఫలితంగా పాక్‌లో నిర్వహించాల్సిన మ్యాచ్‌లను ఐసీసీ తొలగించింది.