పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జాతీయ సెలక్టర్లపై ఆ దేశ మాజీ చీఫ్ సెలెక్టర్ అబ్దుల్ ఖాదిర్ విమర్శలు గుప్పించాడు. ప్రతిష్టాత్మకంగా భావించే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి అనుభవజ్ఞులైన ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్‌ను పక్కన పెట్టడం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ సల్మాన్ భట్‌ను కూడా ఎనిమిది దేశాలు పాల్గొనే టోర్నీకి విస్మరించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పాక్ క్రికెట్ బోర్డు ఏ దిశగా వెళుతుందో అర్థం కావడం లేదు. ఆటగాళ్ల ఎంపికలో ఒక స్థిరత్వమంటూ లేదు. సల్మాన్ అత్యంత అభవం కలిగిన బ్యాట్స్‌మెన్. వన్డేలు, టెస్టుల్లో 40 శాతానికి పైగా బ్యాటింగ్ సగటు కలిగి వున్నాడు. ఇలాంటి బ్యాట్స్‌మెన్స్‌ను అతిపెద్ద టోర్నీల్లో ఒకటైన ఛాంపియన్ ట్రోఫీకి ఎంపిక చేయక పోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు.
అలాగే, ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్‌ను జట్టు ఎంపికలో పరిగణంలోకి తీసుకోక పోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ముగిసిన ఐసీసీ ప్రపంచ ట్వంటీ-20 టోర్నీలో రజాక్ అద్భుత ప్రతిభ కనపరిచాడని, శ్రీలంక పర్యటనలో చెప్పుకోదగిన విధంగా రాణించాడని అబ్దుల్ ఖాదిర్ గుర్తు చేశాడు.