ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేకపోవొచ్చని ఇంగ్లండ్ జట్టు డైరెక్టర్ ఆండీ ప్లవర్ గురువారం సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్‌ను మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో చూడలేకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకొని ఫ్లింటాఫ్ అంతర్జాతీయ క్రికెట్‌కు తాత్కాలికంగా దూరమైన సంగతి తెలిసిందే.
గాయాల కారణంగా ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్ అనంతరం ఫ్లింటాఫ్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే 2015 వరకు అంతర్జాతీయ వన్డేలు, ట్వంటీ- 20 మ్యాచ్‌లు ఆడాలని ఫ్లింటాఫ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ఫ్లింటాఫ్ ఆశలు అడియాశలయ్యే అవకాశం ఉందని తాజాగా ఇంగ్లండ్ కోచ్ ఫ్లవర్ అభిప్రాయపడ్డారు.
ఫ్లింటాఫ్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే గతంలో ఓ సందర్భంలో ఫ్లింటాఫ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో తిరుగులేని వన్డే ఆటగాడిని అనిపించుకోవాలని ఉందన్నాడు. ఇంగ్లండ్‌కు ప్రపంచకప్ సాధించిపెట్టాలని ఆకాంక్ష వ్యక్తం చేశాడు.