టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే ఇప్పుడు క్రికెటర్లందరిలో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్న ప్రపంచ టాప్- 10 క్రికెటర్లలో ధోనీ అగ్రస్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీల రూపంలో వీరిలో మరో నలుగురు ఉపఖండ ఆటగాళ్లు ఉన్నారు.
తాజా జాబితాలో పది మిలియన్ డాలర్ల ఆదాయంతో మహేంద్ర సింగ్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు. 8 మిలియన్ డాలర్ల ఆదాయంతో టీం ఇండియా మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో నిలిచాడు. యువరాజ్ సింగ్, రాహుల్ ద్రవిడ్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. గంగూలీ, ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ఆరో స్థానాన్ని పంచుకుంటున్నారు.
గత 12 నెలల కాలంలో వ్యాపార ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతోపాటు, క్లబ్, జాతీయ జట్టు వేతనాలను ఆధారంగా చేసుకొని క్రికెటర్ల ఆదాయాన్ని ఫోర్బ్స్ లెక్కించింది. యువరాజ్ సింగ్ గత 12 నెలలకాలంలో 5.5 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాడు. ద్రవిడ్, గంగూలీ వరుసగా 5 మిలియన్ డాలర్లు, 3.5 మిలియన్ డాలర్లతో తరువాతి స్థానాల్లో ఉన్నారు.
పాంటింగ్ కూడా 3.5 మిలియన్ డాలర్ల ఆదాయంతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ 4 మిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్ లీ, ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ సంయుక్తంగా ఎనిమిదో స్థానంలోనూ, మైకేల్ క్లార్క్ పదో స్థానంలో నిలిచారు.