సాంప్రదాయ యాషెస్ సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో జరిగిన పరాభవానికి ఆస్ట్రేలియా జట్టు తాజాగా వన్డే సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకుంటుంది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన రెండో వన్డేలోనూ పర్యాటక ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి ఏడు వన్డేల సిరీస్‌లో తన ఆధిక్యతను 2-0కి పెంచుకుంది.
తాజా మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ప్రారంభంలో ఆసీస్‌కు ధీటుగా బదులిచ్చారు. అయితే వాట్సన్ బంతిని చేతబట్టడంతో పరిస్థితి మారింది.
ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్లు ఆండ్ర్యూ స్ట్రాస్, రవి బొపారా (27) భాగస్వామ్యాన్ని వాట్సన్ విడదీశాడు. వాట్సన్‌కు బొపారా వికెట్ల ముందు దొరికిపోవడంతో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ ఆస్ట్రేలియా బౌలర్లు ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. బొపారా అవుటైన కాసేపటికే ప్రియర్ (1)ను కూడా వాట్సన్ పెవీలియన్‌కు పంపాడు.
అనంతరం మరో రెండు ఓవర్లలోనే కెప్టెన్ స్ట్రాస్ (47)ను స్పిన్నర్ హౌరిట్జ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లేనిపరుగు కోసం ప్రయత్నించి ఓవైష్ షా (12) దురదృష్టవశాత్తూ పెవీలియన్ చేరాడు. అనంతరం కాలింగ్‌వుడ్ క్రీజ్‌లో ఒంటరిపోరాటం ప్రారంభించాడు.
అయితే సహచరులందరూ ఒక్కొక్కరిగా పెవీలియన్ దారిపడుతూ ఆస్ట్రేలియా బౌలర్ల పనిని సులభం చేశారు. కాలింగ్‌వుడ్ (56) పదో వికెట్‌గా వెనుదిరిగడంతో ఇంగ్లండ్‌కు పరాజయం తప్పలేదు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ 46.1 ఓవర్లలో 210 పరుగులు మాత్రమే చేసి వికెట్లన్నీ సమర్పించుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది.
ఓపెనర్లు వాట్సన్ (34), కొత్త వికెట్‌కీపర్ పైనే (26) జోడి తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించింది. వాట్సన్ పెవీలియన్‌కు చేరడంతో తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాపై అనంతరం ఇంగ్లండ్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. పరుగులరాకను కష్టతరం చేశారు. కామరూన్ వైట్ (42), ఫెర్గ్యూసన్ (55) రాణించడంతో ఆసీస్ స్కోరు 200లకు చేరవయింది. చివర్లో జాన్సన్ (43) మెరుపు ఇన్నింగ్స్‌కు జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. జాన్సన్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.