ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ అంతర్జాతీయ ట్వంటీ- 20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేలు, టెస్ట్ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని తెలిపాడు. ట్వంటీ- 20లకు అందుబాటులో ఉండేందుకు అంతర్జాతీయ క్రికెటర్లు టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్న తరుణంలో.. పాంటింగ్ ఇందుకు భిన్నమైన నిర్ణయం తీసుకొని పలువురిని విస్మయపరిచాడు.
టెస్ట్‌లు, వన్డేలకు మరింత సమయం కేటాయించేందుకు వీలుగా ట్వంటీ- 20ల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు పాంటింగ్ వెల్లడించాడు. ఇదిలా ఉంటే గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ- 20 టోర్నమెంట్‌కు మాత్రం అందుబాటులో ఉంటానని చెప్పాడు. తన తాజా నిర్ణయాన్ని ఆస్ట్రేలియా సెలెక్టర్లు, బోర్డు వర్గాలకు ఇప్పటికే తెలియజేశానన్నాడు.
ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన యాషెస్ సిరీస్‌ను పాంటింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా సేన చేజార్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా మీడియా, మాజీ క్రికెటర్ల నుంచి పాంటింగ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా అతను వన్డేలు, టెస్ట్‌ల్లో కెరీర్‌ను పొడిగించుకునేందుకు ట్వంటీ- 20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
గత 10, 12 రోజులుగా యాషెస్ పరాజయం, భవిష్యత్ కెరీర్‌పై ఆలోచించాననని పాంటింగ్ ఓ ప్రకటనలో తెలిపాడు. ఇప్పుడు అంతర్జాతీయ ట్వంటీ- 20లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. పాంటింగ్ రిటైర్మెంట్‌తో ట్వంటీ- 20 కెప్టెన్సీ మైకేల్ క్లార్క్‌కు బదిలీ కానుంది. వన్డేలు, టెస్ట్‌ల్లో మాత్రం పాంటింగ్ కెప్టెన్సీ కొనసాగుతోంది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.