ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) జాతీయ కాంట్రాక్టును తీసుకునేందుకు ఆ దేశ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ నిరాకరించాడు. తన కెరీర్ విషయంలో మరింత నియంత్రణ సాధించేందుకు ఫ్లింటాఫ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రసుత్తం మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొని దుబాయ్‌లో పునరావాస కార్యక్రమంలో పాల్గొంటున్న ఫ్లింటాఫ్‌కు ఈసీబీ రెండో టైర్ కాంట్రాక్టు అందజేయాలనుకుంది.
మోకాలి గాయం కారణంగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫ్లింటాఫ్ వన్డే, ట్వంటీ- 20 క్రికెట్‌లో మాత్రం కొనసాగాలనుకుంటున్నాడు. వచ్చే ఏడాది బంగ్లాదేశ్ పర్యటన సమయానికి తిరిగి జట్టుకు అందుబాటులో ఉండాలని భావిస్తున్నాడు.
తాను బోర్డు నుంచి జాతీయ కాంట్రాక్టు ఆశించలేదని ఫ్లింటాఫ్ చెప్పాడు. ఎప్పుడు ఆడాలో, ఎప్పుడు ఆడకూడదో చెప్పించుకునే పరిస్థితిలో నేనున్నానని భావించడం లేదని ఫ్లింటాఫ్ పేర్కొన్నాడు. 11 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడాను. నా శారీరక సామర్థ్యం ఏమిటో నాకు తెలుసు. ఇప్పుడు పునరావాస కార్యక్రమానికి ఈసీబీ తనకు అందిస్తున్న ఆర్థిక సాయానికి ఫ్లింటాఫ్ కృతజ్ఞతలు చెప్పాడు.