ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు యూనిస్ ఖాన్ షరతు! (Younis | lead | Pakistan | 2011 World Cup | Cricket | Ejaz Bhat | PCB)
కెప్టెన్సీ పదవికి రాజీనామా లేఖను సమర్పించిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్ ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు కొన్ని షరతులు విధించినట్టు సమాచారం. తన రాజీనామా లేఖను తిరిగి వెనక్కి తీసుకోవాలంటే తనను 2011 ప్రపంచ కప్ పూర్తయ్యేంత వరకు కెప్టెన్‌గా కొనసాగించాలన్నది ప్రధాన డిమాండ్.
అలాగే, జట్టు మరిన్ని విజయాలు సాధించేందుకు, ఆటగాళ్లు శక్తిమేరకు రాణించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు, తనకు ఇష్టమైన జట్టును ఎంపిక చేసుకునేందుకు వీలుగా మరికొన్ని అధారాలు ఇవ్వాలన్నది రెండో డిమాండ్‌గా పెట్టినట్టు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
పీసీబీ ఛైర్మన్ ఇజాజ్ భట్‌తో యూనిస్ ఖాన్ తాజాగా భేటీ అయ్యారు. ఇందులో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులపై చర్చించారు. ఆ తర్వాత బోర్డు విజ్ఞప్తి మేరకు రాజీనామా లేఖను వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు యూనిస్ ఛైర్మన్‌కు చెప్పారు.
అయితే, తన షరతులను అంగీకరించాలని కోరారు. ఛైర్మన్, యూనిస్ ఖాన్‌లు ఈ రోజు సమావేశమయ్యారు. ఈ భేటీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సమావేశం పూర్తి వివరాలను మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తామని బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.