ట్రినిడాడ్ బ్యాట్స్‌మన్ పొలార్డ్ బౌండరీల ఔట్లు, సిక్సర్ల బాంబులతో ఉప్పల్ స్టేడియం దడదడలాడిస్తూ... భాగ్యనగరానికి ఒకరోజు ముందే దీపావళి తీసుకొచ్చేశాడు. చప్పగా జీవం లేనట్లుగా సాగుతోన్న చాంపియన్స్ లీగ్‌కు జీవం పోసేటట్లుగా మెరుపు ఇన్నింగ్స్ ఆడిన పొలార్డ్ అసలు సిసలు టీ20 ఇన్నింగ్స్‌ను రుచి చూపించాడు.
18 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులను సాధించిన పొలార్డ్ ఒంటిచేత్తో న్యూసౌత్‌వేల్స్ జట్టును చిత్తు చిత్తుగా ఓడించాడు. తొలుత 171 పరుగుల విజయం లక్ష్యంతో బరిలో ట్రినిడాడ్ జట్టు 15.2 ఓవర్లలో 118 పరుగులు సాధించి కష్టాల్లో పడిపోయింది. అలాంటి సమయంలో బ్యాటింగ్‌కు దిగిన పొలార్డ్ తనలోని పోరాట యోధుడిని నిద్రలేపి, విజృంభించి ఆడి జట్టును విజయపథంలో నడిపించాడు.
కాగా.. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం జరిగిన లీగ్ ఏ మ్యాచ్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగో నాలుగు వికెట్ల తేడాతో న్యూసౌత్‌వేల్స్‌పై విజయం సాధించి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూసౌత్‌వేల్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ట్రినిడాడ్ జట్టు ఆదిలోనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిపోగా.. పొలార్డ్ తన విధ్వంసర బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని చేకూర్చిపెట్టాడు.