ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ట్వంటీ-20 మ్యాచ్‌లు ఆడాలని వుంది: యూనిస్ ఖాన్ (Karachi | Yunis | Afridi | Pakistan | Captain | Twenty-20 | England | World Cup)
ట్వంటీ-20 ఫార్మెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్ తిరిగి ఆ తరహా క్రికెట్‌ను ఆడాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. ఈ పొట్టి ఫార్మెట్‌పై తన మనస్సులో ఉన్న విషయాన్ని బయటపెట్టాడు. ఇంగ్లండ్ గడ్డపై జరిగిన రెండో ట్వంటీ-20 ప్రపంచ కప్‌ను తమ దేశానికి అందించిన యూనిస్.. ఆ వెనువెంటనే టీ-20 ఫార్మెట్‌కు సగర్వంగా గుడ్‌బై చెప్పాడు.
అయితే, ఈ క్రికెట్‌కు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణో లేక ధనార్జనో తెలియదు గానీ తిరిగి ట్వంటీ-20 మ్యాచ్‌లు ఆడాలని ఉబలాటపడుతున్నాడు. దీనిపై యూనిస్ మాట్లాడుతూ.. ట్వంటీ-20లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ మళ్లీ తిరిగి రావాలనే ఆలోచన ఉందన్నారు.
ఇదిలావుండగా, షాహిద్ ఆఫ్రిది, యూనిస్ ఖాన్‌ల మధ్య విభేదాలు ఉన్నట్టు పాక్ మీడియా కోడై కూస్తోంది. పైపెచ్చు.. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం తనపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై కలత చెందిన యూనిస్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఆ సమయంలో ఓ వర్గం ఆఫ్రిదిని కెప్టెన్‌గా చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించింది.
అయితే, బోర్డు పెద్దలు యూనిస్‌ను బుజ్జగించి 2011 ప్రపంచ కప్ వరకు కెప్టెన్‌గా నియమించారు. వన్డేలకు, టెస్టులకు మాత్రమే యూనిస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ట్వంటీ20కు ఆఫ్రిది నాయకత్వం వహిస్తున్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు తనకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించిన వారికి తగిన గుణపాఠం నేర్పేందుకు ఆఫ్రిదిని సారథ్యం నుంచి తప్పించి టీ-20 ఫార్మెట్‌కు కూడా తానే కెప్టెన్‌గా వ్యవహరించాలని యూనిస్ భావిస్తున్నట్టు సమాచారం.