పాకిస్థాన్ కెప్టెన్ యూనిస్ ఖాన్‌కు తాను వ్యతిరేకిని కానని మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ స్పష్టం చేశాడు. పాకిస్థాన్ కెప్టెన్‌గా యూనిస్ ఖాన్ స్థానంలో షాహిది అఫ్రిదిని ఎంపిక చేయాలంటూ.. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌కు కొంత మంది ఆటగాళ్ల బృందంతో కలిసి ప్రతిపాదించినట్లు వస్తున్న వార్తలను మాలిక్ ఖండించాడు.
కరాచీలో ఓ ప్రముఖ ఛానెల్ షోలో పాల్గొన్న సందర్భంగా మాలిక్ మాట్లాడుతూ, యూనిస్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలంటూ.. తాను ఏ ఆటగాళ్ల బృందంతోను కలిసి వ్యతిరేకతను చూపలేదన్నాడు. తాను పీసీబీ ఛైర్మన్‌ను కలిసిన మాట్ వాస్తవమేనని.. అయితే.. కెప్టెన్సీపై తాను ఎలాంటి సూచనలు చేయలేదన్నాడు.
చిన్న చిన్న విషయాలకే కెప్టెన్లను మార్చాలని చెప్పడం అన్నది తన విధి కాదన్నాడు. తనకేదైనా సమస్యలు వస్తే.. తాను నేరుగా యూనిస్‌తోనే మాట్లాడగలనని ఉద్ఘాటించాడు. చిన్న చిన్న సమస్యలుండటం సాధారణం.. వాటిని తాము పరిష్కరించుకుని.. ఒకరికొకరు సహకరించుకుంటామన్నాడు.
జట్టులో అందరూ యూనిస్‌కు మద్దతుగానే ఉన్నారని.. వ్యతిరేక గ్రూపులంటూ ఏవీ లేవని మాలిక్ వివరించాడు. అంతకుముందు.. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత స్వదేశానికి చేరుకున్న అనంతరం పాక్ జట్టులో వివాదాలు రాజుకున్నాయని.. కొందరి ఆటగాళ్ల బృందంతో కలిసి యూనిస్ స్థానంలో అఫ్రిదిని కెప్టెన్‌గా ఎంపిక చేయాలంటూ.. మాలిక్ ప్రతిపాదించినట్లుగా మీడియా కథనాలు వెలువడి సంగతి తెలిసిందే.