తొలి వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పాక్

మంగళవారం, 3 నవంబర్ 2009( 17:25 IST )
తటస్థ వేదిక అబుదాబీలో మరో క్రికెట్ సమరం ఆరంభమైంది. ఈ సమరంలో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల తొలి డే అండ్ నైట్ మ్యాచ్ మంగళవారం అబుదాబీలోని షేక్ జయీద్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ యూనిస్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఆరంభంలోనే కివీస్ ఫాస్ట్ బౌలర్ల షేన్ బాండ్ పాక్ ఓపెనర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరక ముందే రెండు ప్రధాన వికెట్లను బాండ్ నేలకూల్చాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సల్మాన్ భట్‌ను డకౌట్ చేశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతికే భట్ పెవిలియన్ దారి పట్టాడు.
ఆ తర్వాత ఫస్ట్‌డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ యూనిస్ ఖాన్ కూడా బాండ్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికే పెవిలియన్ చేరాడు. జట్టు స్కోరు ఖాతా తెరవకుండానే భట్, యూనిస్ ఖాన్‌లను కివీస్ బౌలర్ బాండ్ అవుట్ చేసి, మ్యాచ్‌పై పట్టుసాధించాడు. మరో ఓపెనర్ ఖలీద్ లతీఫ్ (13), మహ్మద్ యూసఫ్ (6)లు ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డారు. ఇదిలావుండగా, ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
పాకిస్థాన్.. భట్, లతీఫ్, యూనిస్ ఖాన్, యూసుఫ్, అక్మల్, ఆఫ్రిది, అక్మాల్, రజాక్, అమీర్, ఉమర్ గుల్, అజ్మల్.
న్యూజిలాండ్ జట్టు.. రెడ్‌మాండ్, మెక్‌కల్లమ్, గుప్తిల్, టేలర్, స్టైరిష్, ఓరమ్, వెట్టోరి, ఎన్ఎల్.మెక్‌కల్లమ్, సౌథీ, బట్లర్, షేన్ బాండ్.