ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » బ్లాక్‌లో క్రికెట్ టిక్కెట్ విక్రయం: అభిమానుల ధర్నా! (Block Ticket | Circket | Fifth ODI | Australia | India | Uppal Stadium)
బ్లాక్‌లో క్రికెట్ టిక్కెట్ విక్రయం: అభిమానుల ధర్నా!
బుధవారం, 4 నవంబర్ 2009( 18:04 IST )
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం ఐదో వన్డే మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈమ్యాచ్ టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయించారు. దీనిపై క్రికెట్ అభిమానులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లలో ఇరు జట్లు సమానంగా తలా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించాయి. దీంతో గురువారం జరిగే ఐదో వన్డే అత్యంత ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించాలనుకుని అభిమానులు టిక్కెట్ల కోసం ఎగబడ్డారు.
అయితే.. స్టేడియం నిర్వాహకులు అభిమానులకు పూర్తి నిరుత్సాహం కలిగించారు. టిక్కెట్ల విక్రయాన్ని అప్పగించిన యూకో బ్యాంకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించకుండా బ్లాకులో విక్రయించింది. దీన్ని తెలుసుకున్న అభిమానులు ఉప్పల్ స్టేడియం ఎదుట ధర్నాకు దిగారు.
అలాగే, 300 రూపాయల టిక్కెట్‌ను 800కు, 800 రూపాయల టిక్కెట్టును 1500 రూపాయలకు, రూ.1000 టిక్కెట్‌ను రూ.3000కు, రూ.2 వేల ధర కలిగిన టిక్కెట్‌ను రూ.5 వేలకు, రూ.4 వేల టిక్కెట్‌ను 10 వేల రూపాయలకు పెంచి బ్లాక్‌లో విక్రయిస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో స్పందించిన పోలీసులు నలుగురు మధ్యవర్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.