పోరాడి ఓడిన భారత్...3 పరుగులతో ఆసిస్ గెలుపు

మూడు పరుగుల తేడాతో ఆసిస్ గెలుపు
గురువారం, 5 నవంబర్ 2009( 23:01 IST )
హీరోహోండా కప్ 2009లో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో వన్డేలో భారత క్రికెట్ జట్టు ఆసిస్ చేతిలో పోరాడి తుదకు మూడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
అత్యంత ఉత్కంఠ భరితంగా గురువారం నాడు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ఇండియా చేజేతులా విజయాన్ని చేజార్చుకుంది. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఉన్నంత వరకు విజయం తప్పదని భావించిన క్రికెట్ అభిమానులకు ఆశాభంగం కలిగింది. అనవసరంగా పరుగు తీయబోయి ఔట్ కావడంతో ఇక భారత్ విజయంపై ఆశలు అడుగంటాయి.
హర్భజన్ సైతం ఔట్ కావడంతో ఇక మునాఫ్, ప్రవీణ్ కుమార్ ప్రతి బంతికి పోరాడారు. చివరికి మూడు పరుగుల తేడాతో ఓటమికాక తప్పలేదు.
ఇదిలావుండగా వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ వన్డేల్లో సచిన్ 17000 పరుగుల మైలు రాయిని గురువారం నాడు హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోనున్న రాజీవ్ గాంధీ స్టేడియంలో అధిగమించాడు.
వ్యక్తిగత పరుగుల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ చరిత్రలో 17000 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. క్రికెట్‌లో అడుగు పెట్టి నేటికి సరిగ్గా 20 సంవత్సరాలు పూర్తయిన రోజే ఈ అరుదైన రికార్డును సాధించడం విశేషం.
1989 నవంబరు 5న మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన సచిన్ క్రికెట్ ప్రంపంచంలో ఎన్నో రికార్డులు సృష్టించాడు. దీంతోపాటు గురువారం హైదరాబాద్‌లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో సెంచరీ చేసి మరో రికార్డు సాధించాడు. వన్‌డేల్లో సచిన్‌కు ఇది 45వ సెంచరీ కావడం గమనార్హం.