న్యూజిలాండ్ ఓపెనర్ మెక్‌కల్లమ్ ఫామ్‌లోకి వచ్చారు. అబుదాబీలో శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మెక్‌కల్లమ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా న్యూజిలాండ్ జట్టు 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
పాకిస్థాన్, కివీస్ జట్ల మధ్య మూడు వన్డే సిరీస్ తటస్థ వేదిక అబుదాబీలో జరుగుతున్న విషయం తెల్సిందే. తొలి వన్డేలో పాకిస్థాన్ జట్టు విజభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో పర్యాటక కివీస్ జట్టు కేవలం 150 పరుగు లోపే ఆలౌట్ అయింది. అయితే శుక్రవారం జరిగిన రెండో వన్డేలో మాత్రం కివీస్ బ్యాట్స్‌మెన్స్ జూలు విదిల్చారు. ఫలితంగా 64 పరుగులతో ప్రత్యర్థిపై గెలుపొందారు.
తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో 303 పరుగుల భారీ స్కోరు చేసింది. మెక్‌కల్లమ్ 131 పరుగులు చేయగా, మిగిలిన బ్యాట్స్‌మెన్స్ తమ వంతు సహకారం అందించారు. ఆ తర్వాత 304 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 47.2 ఓవర్లలో 239 పరుగులకే కుప్పకూలింది.
పాక్ ఓపెనర్లు సల్మాన్ భట్ (59), ఖలీద్ లతీఫ్ (45)లు ఓపెనింగ్ భాగస్వామ్యంగా తొలి 16 ఓవర్లలో 77 పరుగులు చేశారు. అయితే, కివీస్ బౌలర్ స్టైరిష్ ధాటికి పాక్ మిడిల్ ఆర్డర్ ఒక్కసారి కుప్పకూలింది.
స్టైరిష్ ఓవర్లలో కేవలం పది పరుగుల వ్యత్యాసంలో నాలుగు ప్రధాన వికెట్లను పాక్ కోల్పోయింది. యూనిస్ ఖాన్ (19) పరుగులు చేయగా, తొలి వన్డేలో రాణించిన షాహిద్ ఆఫ్రిది డకౌట్ అయ్యాడు. దీంతో పాక్ జట్టు 134 పరుగులకే ఐదు టాప్ వికెట్లను కోల్పోయింది.