టెస్టు క్రికెట్‌లో గులాబీ రంగు బంతులను వాడాలనే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆలోచన సరికాదని భారత మాజీ ఆటగాడు గుండప్ప విశ్వనాథ్ చెప్పారు. టెస్టు క్రికెట్‌ను బలహీనపరచకుండా మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఐసీసీ చర్యలు తీసుకోవాలని గుండప్ప కోరారు.
ఆటగాడి నైపుణ్యం టెస్టు క్రికెట్లోనే బయటపడుతుందని, టెస్టు ఫార్మాట్ క్రికెటర్‌కు ఆటలోని ఎన్నో మెలకువలను నేర్పిస్తుందని గుండప్ప తెలిపారు. అందుచేత టెస్టు క్రికెట్‌ను మరింత అభివృద్ధి పరిచాలని విశ్వనాథ్ ఐసీసీని కోరారు.
ఇదేవిధంగా.. భారత్ మరిన్ని టెస్టు మ్యాచ్‌లలో ఆడాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇటీవల పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్ ఆడటం ద్వారానే క్రికెటర్లు తమ తమ ఆటతీరును మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని సచిన్ అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.