వచ్చే యేడాది ఏప్రిల్ నెలలో జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-3 టోర్నమెంట్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు ఆడనున్నారు. ఇందుకోసం భారత్‌కు క్రికెటర్లను అనుమతిస్తామని పాక్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇజాజ్ భట్ తెలిపారు.
ఇస్లామాబాద్‌లో జరిగిన ప్రజా పద్దుల కమిటీలో పాల్గొన్న తర్వాత భట్.. ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీతో ఫోనులో మాట్లాడారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్-3లో పాలు పంచుకునే అంశంపై చర్చలు జరిపారు.
అందువల్ల ఈ టోర్నీలో ఎక్కువ సంఖ్యలో తమ దేశ ఆటగాళ్లు పాల్గొనే అవకాశాలు ఉన్నట్టు ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు. ఇందుకోసం ఢిల్లీకి వెళ్లేందుకు తమ దేశ ఆటగాళ్లకు ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చేందుకు సానుకూల హమీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
కాగా, ఐపీఎల్ టోర్నీలో షాహిద్ ఆఫ్రిది, షోయబ్ మాలిక్, సయీద్ అజ్మల్, దినేష్ కనేరియా, ఇమ్రాన్ పర్హాత్, ఇమ్రాన్ నజీర్‌లతో పాటు మరికొంతమంది పాక్ క్రికెటర్లు పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి.