అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆదివారం ప్రకటించిన ర్యాంకుల పట్టికలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్ధనే అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఐసీసీ టాప్ ర్యాంకును కైవసం చేసుకోవడం జయవర్ధనేకు ఇదే తొలిసారి. అలాగే, భారత పరుగుల యంత్రం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మూడు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకులోకి వచ్చారు.
అయితే.. 'టీమ్ ఇండియా' ఓపెనర్ గౌతం గంభీర్ ఒక స్థానం దిగజారి మూడో ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. రెండో స్థానంలో శ్రీలంక కెప్టెన్ కుమార సంగక్కర కొనసాగుతున్నాడు. ఇకపోతే, రాహుల్ ద్రావిడ్ ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని 21వ స్థానంలో కొనసాగుతుండగా, మహేంద్ర సింగ్ ధోనీ 30వ స్థానంలో ఉన్నాడు.
శ్రీలంక ఆటగాడు జయవర్ధనే అహ్మదాబాద్ టెస్టులో 275 పరుగులు చేయడంతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. 108 టెస్టు మ్యాచ్‌ల కెరీర్‌లో జయవర్ధనే డబుల్ సెంచరీ సాధించడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. అంతేకాకుండా, తొమ్మిది వేల పరుగలు పూర్తి చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా, ఐసీసీ ర్యాంకుల నిబంధనల మేరుక 900 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న 25వ బ్యాట్స్‌మెన్‌గా జయవర్ధనే రికార్డు సృష్టించాడు.
ఇకపోతే.. బౌలింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ల డలే స్టైన్ అగ్రస్థానంలో ఉండగా, భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఒక స్థానం దిగజారి ఆరో స్థానంలో ఉన్నాడు. అలాగే, జట్ల విషయానికి వస్తే ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, దక్షిణాఫ్రికా, భారత్‌లు రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్ ఐదో స్థానంలోనూ, పాకిస్థాన్ ఆరు, న్యూజిలాండ్ ఏడు, వెస్టిండీస్ ఎనిమిది స్థానాలను దక్కించుకున్నాయి.